నరసింహ స్తోత్రమ్

కమలాకుచలంభిత కుంకుమతో
నియతారుణతాగుణపీతతనో!
జలజాయతవీక్షణ! లోకపతే!
వరదో భవ దేవ! నృసింహ విభో! 1

అర్ధం: లక్ష్మీదేవిని గాఢముగా ఆలింగనము చేసుకొనుటవలన శరీరమునకద్దిన ఎఱ్ఱని కుంకుమచే ఎఱ్ఱబడిపోయిన పీతశరీరము కలవాడా! జలజాతదృక్కులు కలవాడా! ఓ లోకపతీ! నారసింహ! నీవు భక్తులకు వరప్రదుడవగుము.

స చతుర్ముఖశూలిసురేశజన
ప్రముఖామరసంతతిమౌళిమణే!
శరణాగతదీనసమస్తజగ
త్పరిరక్షణ దీక్షిత! పాలయమామ్. 2

అర్ధం: చతుర్ముఖాదిదేవతల యొక్క శీర్షములయందు మణిగా భాసించు ఓ నరసింహా! శరణాగతులైన దీనులను చక్కగా కాపాడు దీక్ష కల్గినవాడా! నన్ను పాలించుము.

అతిఘోరతయా తవ దుర్వచనై
రతిలంఘితవేలమహాదురితై:
సహితం పరుషం సభయం నృహరే!
పరిపాలయమాం కరుణా జలధే || 3

అర్ధం: ఓ కరుణాసముద్ర! నారసింహా! అతిభయంకరముగా హద్దులను దాటినట్టి మిక్కిలి చెడ్డమాటలచేత, మర్యాదనుల్లంఘించినట్టి, ఘనపాపములచేతను కూడియుండి పరుషస్వభావము కల్గి సంసారభీతి కలవాడినైన నన్ను అనుగ్రహించి పాలించుము.

అతికేసరినారముదారమతే:
భవభీతివిదారణదక్షమతే:
శరణాగతశంకరపూజ్యనుతాత్
కమలాదయితాత్ న పరం కలయే || 4

అర్ధం: ఉదారమతిమంతుడు, సంసారభయమును పోగొట్టు సామర్థ్యము గలవాడు, ఒడలుకు నిప్పంటుకొనగానే మంటలనార్పుమని ప్రార్థిస్తూ శరణాగతి చేసిన శ్రీ శంకర భగవత్పాదులచేత బాగుగా స్తోత్రము చేయబడిన నారసింహస్వామి కన్న అన్యదేవుడిని స్మరించను.

అతిసాంద్రమరీచిమయద్యుమణే:
రధికాధికకాంతిమతో నృహరేః
నిజభక్తవిసారితసౌమ్యకృపాత్
నరసింహ విభో ర్నపరం కలయే || 5

అర్ధం: దట్టమైన తేజస్సుచే ప్రకాశించు సూర్యుడనే మణి (ద్యుమణి) కన్న అధికాధికమైన కాంతిగలవాడు, నిజభక్తునిపై ప్రసరింపజేయు శీతలదృష్టి కల నరసింహ స్వామికన్న అన్యదైవమును పొందను

శరకోపకవిస్తుత విశ్వతనో!
పరకాలమునీడిత చిత్రకృతే!
త్వరయానుగృహీతసుభక్తవచ:
పరిపాలనదక్ష! శుభం కలయ || 6

అర్ధం: “ఆడియాడియగం కటైన్దు" అను పాశురములో శఠగోపులచే సర్వవ్యాపియైన విషువుగా పొగడబడినవాడా! పరకాల (తిరుమంగైయాళ్వార్) సూరిచేత చిత్రమైన అవతారం కలవాడివిగా ప్రస్తుతింపబడినవాడా! విష్ణువంతట ఉంటాడు అన్న భక్తుని మాటను నిలబెట్టుటకు వెంటనే స్తంభమునుండి అవతరించినవాడా! ప్రహ్లాదాది భక్తులవలె నన్ను కూడా శుభములనొసగి కాపాడుము తండ్రీ!

సురమౌనిజనాద్భుతరూపధరం
కమలాహృది కల్పిత భీతితతిం |
రజనీ చరనాథతమోఘ్నకరం
నరసింహగురుం భజ దేవనుతమ్ || 7

అర్ధం: సురులకు మునులకు నచ్చెరువు కలిగించు ఎన్నడు చూడని సుందరరూపమును ధరించినవాడా! ఇదెక్కడి అపూర్వ ఘోరావతారం అంటూ, లక్ష్మీదేవికి మనస్సులో భయపరంపరను సృష్టించినవాడు, రాత్రించరులకు నాథుడైన హిరణ్యుని తమస్సునణగదొక్కిన హస్తములు కలవాడగు నృసింహగురువును సేవించుము.

శ్రీరామజన్మ సునిరూపితసౌమ్యభావం
శ్రీనారసింహతనుదర్శితభీతి, శాంతిం
వేదోపబృంహణబహూక్తనిజావతారం
ఇనుగుర్తినాథనృహరిం సతతం భజేహమ్ || 8

అర్ధం: శ్రీరామావతారంలో సౌమ్య (శాంత) భావమును నిరూపించినవాడు, నారసింహాకృతిచే తండ్రికి భీతిని, తనయునకు శాంతిని కల్గించినవాడు, వేదార్థములను విస్తరింపచేయు బహుపురాణములలో అనేక విధములుగా అవతార మట్టమును గూర్చి చెప్పబడినవాడు సర్వదేవతా సేవ్యుడైన నరసింహస్వామిని నేను భజించుచున్నాను.

బహుధా పరిక్లుప్తపురాణతతిం
నిజబాలనుతేరృతశాంతతనుం
శరవర్షహతాఖిలశత్రుజనం
మృగరాజనరం భజ సర్వనుతమ్ || 9

అర్ధం: అనేక విధాలుగా అనేక పురాణములలో నిజ అవతారమును గురించి ప్రస్తావింప బడినవాడు, తన బాలభక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థనచే చల్లబడిన రూపం కలవాడు, శరవర్ష ప్రహారముచే చంపబడిన హిరణ్యకశిపుని సహస్రాధిక సైన్యము కలవాడునైన సింహమర్త్యుని, సర్వనుతుని భజింపుము. (భక్తుడైన ప్రహ్లాదుని మాట సత్యమని నిరూపించుటకు సభలోనే నృసింహునిగా విష్ణువవతరింపగా అతని రూపుమాపుటకు హిరణ్యకశిపుని సైన్యం విజృంభించగా స్వామియా సహస్రాధిక సైన్యసముదాయమును నశింపజేసి, ప్రహ్లాదునికి విరాట్స్వరూపంతో దర్శనమిచ్చినాడని భాగవత పురాణము.)

వినా నారసింహం నదేవో న దేవ:
సదా నారసింహం భజేహం భజేహం
హరే విష్ణుతేజ:! ప్రసీద ప్రసీద
హితం నారసింహ! ప్రయచ్ఛ ప్రయచ్ఛ || 10

అర్ధం: నరసింహుని మించిన భక్తానుగ్రాహియైన దైవము లేదు. కాన నేను సదా నృసింహు భజింతును. భజింతును. ఓ విష్ణుతేజమా! నన్ను అనుగ్రహింపుము. అనుగ్రహింపుము. ఓ నారసింహా! నాకు మేలును కలిగించుము. నాకు మేలును కలిగించుము.

అహం త్వా దిదృక్షు: వినీతైకవేషః
ప్రణంతుం సదా పాదయుగ్మం చరామి
సకృత్రేమహస్తేన భక్తేః ఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో! నారసింహ! 11

అర్ధం: నుసింహప్రభూ! నిన్ను నేను సేవింపదలచినవాడనై వినయ విధేయతలతో కూడియుండి నిరంతరము నీ పాదపూజ చేయుచున్నాను. ఒకసారి నీ ప్రేమ పూరమైన హస్తములచే భక్తి యొక్క ఫలమగు సంసారతరణరూప మోక్షము ననుగ్రహింపుము.

అజ్ఞానినా మయా దోషాన్కృతాన్ సర్వాన్షయానిధే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం పర్వతాగ్రద్యుతే! ప్రభో! 12

అర్ధం: అజ్ఞానంచే నేను చేసిన సర్వదోషములను క్షమించుము. మా గ్రామమునందు చిన్నకొండ పై నృసింహునిగా స్వయంవ్యక్తుడవై "కొండ పై దీపంవలె" ప్రకాశించు ఓ స్వామీ! నా దోషములను మన్నింప మరల ప్రార్థించుచున్నాను.