శ్రీ నారసింహ ప్రపత్తి
ఈశానాం జగతోస్య దేవనృహరేః విష్ణోః వరాం శ్రేయసీం
తద్వామాంకగతాం దయార్ద్ర హృదయాం తత్ క్షాంతిసంపోషిణీం
అంభోజాంచితచారుభూషణకరాం జాజ్జ్వల్యమానాంశ్రియం
వాత్సల్యాదిగుణౌఘరత్నవినుతాం వందే జగన్మాతరమ్ || 1
అర్ధం: జగత్స్యామియైన నరసింహుని పత్నిగా ప్రపంచమును పరోక్షముగా పాలించునది, స్వామిలోని అణగియున్న క్షమాగుణమును పోషించునది, అతని వామాంకము నధిష్ఠించినది, దయతో తడిసిన హృదయము కలది, విలాసపద్మముతో సహ సుందర స్వర్ణాలంకారములతో ప్రకాశించు హస్తము కలది, "హిరణ్యవర్ణాం" అన్నట్లుగా బంగారు కాంతితో అలరారునట్టిది, వాత్సల్యాది గుణజాలముచే మాకు నీలో ఆశ్రయము కల్పించమని స్తుతింపబడినట్టి జగన్మాతయగు లక్ష్మిని నమస్కరించుచున్నాను.
సంతానహీనవనితార్చిత పద్మపాదం
తద్దత్తసంతతిసమాదృతదివ్యరూపం
సాష్టాంగవందనపరిష్కృత భక్త జాతం
ఇన్గుర్తివాస నృహరే! శరణం గతస్యామ్ || 2
అర్ధం: సంతానహీనలైన స్త్రీలకు సంతానమునొసగి వారి సంతానంచేత కూడా సర్వ విధములుగ ఆదరింపబడినవాడు, సాష్టాంగ దండ ప్రణామములచే అనుగ్రహింప బడిన భక్తసముదాయముకల ఓ స్వామీ! నిన్ను నేను శరణు వేడుచున్నాను.
భూతాదిభేదవినివారకభీమసింహ !
స్వప్నప్రసాదితగుణోత్తమభేషజొఘ!
సంతానశాలివనితాజనదత్తడోల!
ఇన్గుర్తివాస నృహరే! శరణం గతస్యామ్ || 3
అర్ధం: భూతప్రేతాదులవలన కలుగు భయమును నివారించువాడా! స్వప్నములో భక్తులకు ఔషధాదులనొసగి ఆరోగ్యమును కూర్చువాడా! సంతానమును పొందిన స్త్రీలచే దేవాలయంలో ఊయలలు కట్టించుకున్నవాడా! ఇన్గుర్తివాసీ! నృసింహ నిన్ను శరణు వేడుచున్నాను.
అర్చాస్వరూపబహిరాగతదూరదేశ
సంచారఖిన్నచరణా సమరాగభావా
కాణాదిపంగుపరిదర్శితరుక్మకాంతీ
శ్రీ నారసింహ చరణా శరణం ప్రపద్యే || 4
అర్ధం: అర్చాస్వరూపములో నున్న నీవు తిరు రూపములో నున్న నీవు తిరువీధిలో వేంచేయునప్పుడు నడచి అలసిపోయినవి, కుంటివాడికి, గ్రుడ్డివాడికి కూడా దర్శనమిచ్చిన నీ దివ్యకాంతి గల పాదములయందు శరణాగతి చేయుచున్నాను.
రక్రవధిపస్య నిధనాయ పరిభ్రమన్‌తౌ
శత్రోశ్చ దేహవిగళద్రుధిరాక్తభాగౌ
భూమౌ చ చిహ్నితసుధాకలశాదిరేఖె
శ్రీనారసింహచరణా! శరణం ప్రపద్యే || 5
అర్ధం: రాక్షసనాయకుడైన హిరణ్యకశిపుని చంపుటకై స్తంభమునుండి వెలువడి శ్రమతో నడచివచ్చి శత్రువును గోళ్ళతో చీల్చిచెండాడుటవలన కారిన రక్తముచే ఎఱ్ఱబడి, భూమి పై సుధాకలశాది రేఖలను గుర్తింపచేసిన నీ పాదములను శరణు వేడుచున్నాను.
రక్తాంబుజద్యుతిపరాజితసుప్రవాళా
బాహ్యైశ్చ రశ్మిభిరథ కృతనీలమేఘా
ఉద్దూత చంద్రనఖరద్యుతిభాసమానౌ
శ్రీనారసింహచరణౌ శరణం ప్రపద్యే || 6
అర్ధం: ఎఱ్ఱబడిన పాదముల కాంతిచే తిరస్కరింపబడిన పవడములు కలవి, బయటికి విరజిమ్ముచున్న కాంతిచే అధరీకృతములైన నీలమేఘముల కాంతి కలవి, ఉదయిస్తున్న చంద్రుని బోలిన గోళ్ళకాంతిచే ప్రకాశించుచున్న నీ పాద ద్వంద్వముల నాశ్రయించుచున్నాను.
స్వీయప్రపన్నహృదయాంబుజ భీతిజన్మ
నోదాయ శాంతిచలితౌ నిజభక్తభోగ్యౌ
శ్రీకాకతీయధరణీశ్వరసేవ్యమానౌ
శ్రీనారసింహచరణౌ శరణం ప్రపద్యే || 7
అర్ధం: తనను ఆశ్రయించిన భక్తుల భీతిని తొలగించుటకై ఉగ్రరూపమును వదలి శాంతరూపంతో కదలివచ్చుచున్నవైనట్టివి, ఆనాటి కాకతీయ నరపతిచే సేవింపబడినట్టి నారసింహుని పాదపద్మములను శరణువేడుచున్నాను.
శ్రీయాదవాద్రి, సురపర్వత, వేదగిర్యా
ద్యాధారభూభృతి చ సింహగిరౌ, సుపూజ్యౌ
ఆహోబలాఖ్య ధరణీధర, మంగళాద్రి
న్యస్తా నృసింహచరణౌ శరణం ప్రపద్యే || 8
అర్ధం: యాదగిరి, వేదాద్రి, వేల్పుకొండ, సింహాచలము, అహోబిలము, మంగళగిరి మొదలగు పర్వతముల పై భక్తులననుగ్రహింపతలంచి మోపిన నీ శ్రీపాదముల వద్ద శరణాగతి చేయుచున్నాను.
కృష్ణాఖ్యసౌవజనిరక్షితరుక్మిణీశ !
భీష్మాఖ్యవీరవచనాత్సుగృహీతచక్ర!
ప్రహ్లాదమోహతిమిరాంతక! భక్తరక్ష!
శ్రీనారసింహ చరణౌ శరణం ప్రపద్యే || 9
అర్ధం: కృష్ణావతారంలో నిజభక్తురాలైన రుక్మిణిని గైకొని రక్షించినవాడా! భారత యుద్ధములో భీష్ముని మాటను సత్యము చేయుటకై చక్రమును ధరించినవాడా! బ్రాహ్మణశాపంచే విష్ణుభక్తి నశించి అజ్ఞానంతో నీపై దండయాత్రను ప్రకటించిన ప్రహ్లాదునికి నృసింహరూపంలో దర్శనమిచ్చి అతని మోహమును పోగొట్టినవాడా!! చకుల రక్షించువాడా! ఓ నారసింహా! నీ సుందరచరణారవిందములు నాకు రక్షకములుగా భావించుచున్నాను.
దండాఖ్యభీకరవనే బహువర్షపూర్వం
విన్న్యస్య సత్రణతతామృదులౌ మనోజ్ఞనౌ
భూయోపి మర్త్యవపుషాశ్రితసింహచిచిహ్నౌ
ఇన్గుర్తివాస నృహరేశ్చరణౌ ప్రపద్యే || 10
అర్ధం: దండకారణ్యమున రామావతారంలో నడచి నడచి గాయపడి అలసిపోయిన నీ మృదుల పాదపద్మములను, భక్తులననుగ్రహించుటకై మరల మానవాకృతినాశ్రయించి సింహముయొక్క చిహ్నములు కలిగిన నీ పాదద్వంద్వమునాశ్రయించుచున్నాను.
ప్రహ్లాదభక్తమణయే భయదానదక్షం
హస్తం ప్రదర్శయ వరప్రద! మాదృశాయ
వ్యామోహహేమకశిపోర్భయవిద్రుతాయ
ఇన్గుర్తివాస నృహరే! శరణం గతోస్మి || 11
అర్ధం: మణివలె శ్రేష్ఠుడవు, సులభుడవైన నీవు అమితవిష్ణుభక్తిభరితుడైన ప్రహ్లాదుని అనుగ్రహించి, మరల మావంటి పామరులకు అభయమునొసంగుము. వ్యామోహమనెడు హిరణ్యకశిపు వలన కలుగు భయమును పారద్రోలినవాడా! ఇన్గుర్తివాస నృహరీ! నీ పాదములే నాకు శరణము. .
శ్రీశేషతల్ప మృదుగాత్రసుఖైకభాజౌ
స్తంభోద్భవ ప్రకరణే పరికంపితాద్రీ
ఉదూతకాంతిసుతిరస్కృతతారకాభౌ
శ్రీనారసింహచరణౌ! శరణం ప్రపద్యే || 12
అర్ధం: శేషతల్పముపై సుఖముగా విద్రించుటచేత మెత్తని శరీర సుఖస్పర్శ కలిగినవి, స్తంభమునుండి ఆవిర్భవించి హిరణ్యుని వధించుటకై ససంభ్రముగా వచ్చుచుండగా పర్వతముల సైతము కంపింపచేసినట్టివై, ఊర్ధ్వముఖంగా ప్రసరించి నక్షత్రములకాంతినే మరుగుపరచినట్టి నారసింహుని పాదపద్మముల శరణు వేడుచున్నాను.
సర్వేషు దేవనివహేష్వపి ముఖ్యభూత
బ్రహ్మాఖ్యదేవవరమంత్రపదాభినంద్యౌ
అచ్ఛేన కాంతినివహేన మషీకృతేందూ
శ్రీనారసింహచరణౌ శరణం ప్రపద్యే || 13
అర్ధం: దేవతలలో ముఖ్యభూతుడైన చతుర్ముఖుడు మొదట తాను దర్శించి స్తుతించగా అట్టి ఉత్తమనారసింహ మంత్రముచే స్తుతింపబడినవై, స్వచ్ఛమైన తెల్లని కాంతిచే చంద్రుని మసిబట్టినట్లుగా (కాంతి విహీనునిగా) చేసినట్టి నరసింహుని వరచరణములను శరణు వేడుదును.
భూమే: ప్రకంపనవిదారితశత్రుచిత్తా
స్వస్తోత్రజాలభయవర్జితభక్తనేత్రా
అర్దేన నారవపుషా శ్రితసర్వభూతౌ
శ్రీనారసింహచరణౌ! శరణం ప్రపద్యే | 14
అర్ధం: తాను స్తంభమునుండి ఉద్భవించు సమయమున భూమి ప్రకంపించుటయేగాక చతురాక్షసుల చిత్తములు కూడ బీటలువారినవట. భక్తుడైన ప్రహ్లాదుడు చేసిన సోత్రముచేత అతని కళ్ళలోని భయమును పోగొట్టినవి, అర్ధమానుషరూపం చేత ఆశ్రితులకు ఆశ్రయించతగినవాడను భావమును కలిగించునవైన నరసింహుని పాదములను శరణు వేడుచున్నాను.
లక్ష్మీనివాస! నిరవద్యగుణైకపూర్ణ!
ప్రహ్లాదభక్తపరితోషిత! భక్తరక్ష!
అర్చావతార సముపాశ్రితమోక్షదాతః !
స్యాo కింకరో వహమనిశం తవ పాదమూలే || 15
అర్ధం: ఓ లక్ష్మీనివాస! అఖిల హేయ ప్రత్యనీక కల్యాణగుణైకపూర్ల! భక్తుడైన ప్రహ్లాదుని పోషించినవాడా! భక్తులను రక్షించువాడా! అర్చావతారమునందుండి ఆశ్రితులకు మోక్షమునిచ్చువాడా! నీ పాదమూలమునందు నేను సదా కింకరుడనగుదును.