శ్రీ నారసింహ మంగళాశాసనమ్

శ్రియ:కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినాం
ఇన్గుర్తిగ్రామవాసాయ నారసింహాయ మంగళమ్ || 1

అర్ధం: లక్ష్మీకాంతుడు, కల్యాణగుణములకు నిధి, యాచకుల కోరికల నెరవేర్చు నిధియైనవాడునగు ఇనుగుర్తి నృసింహస్వామికి మంగళమగుగాక!

లక్ష్మీససంభ్రమాలోకరంజితోత్తుంగమూర్తయే
అవతే సర్వభూతానాం - నారసింహాయ మంగళమ్ || 2

అర్ధం: ససంభ్రమైన లక్ష్మీదేవితరంగ సదృశదృష్టితాడనముచే పొంగిపోయిన శరీరం కలవాడు, సర్వభూతముల యనిష్టములను తొలగించి రక్షించువాడైన నార సింహునికి మంగళమగుగాక.

శత్రుభీకరరూపాయ - భక్తతాపశమాయ చ
ఆకారద్వయనిష్ఠాయ నారసింహాయ మంగళమ్ || 3

అర్ధం: శత్రువులకు భయాన్ని కలిగించు రూపం కలవాడై, అదే విధంగా భక్తుల తాపాన్ని తొలగించువాడై ఆకారద్యయవంతుడైన నరసింహునికి మంగళము అగుగాక. .

సర్వావయవసంభూతరోమగంధఘన చ
భక్తసమ్మోహనాయాస్తు - నారసింహాయ మంగళమ్ || 4

అర్ధం: శరీరమునందలి అవయవ సంఘాతములో మొలకెత్తిన రోమరాజిలోని సహజగంధముచేత భక్తులను సమ్మోహపరచువాడైన నరసింహునికి మంగళము అగుగాక.

అమోఘ భక్తి సంపూర్ణే బాలభక్తీ సుధీమతి
ధ్యానారూఢస్వరూపాయ - నారసింహాయ మంగళమ్ || 5

అర్ధం: అమోఘ భక్తిపూర్ణుడైన బుద్ధిమంతుడగు ప్రహ్లాదుని ధ్యానమునకు గోచరమగు స్వభావం కలవాడైన నరసింహునికి మంగళమగుగాక.

హిరణ్యకశిపుప్రఖ్యరక్షోగజవిపాటినే
దేవానందప్రదాత్రేచ - నారసింహాయ మంగళమ్ || 6

అర్ధం: హిరణ్యకశిపుడను రక్షోగణమును చీల్చి దేవతల ఆనందమునకు కారణావతారుడైన నరసింహునకు మంగళమగుగాక.

వృషభే స్వాతి నక్షత్రే - చతుర్దశ్యాం శుభేదినే
సాయం స్తంభే వవతీర్ణాయ - నారసింహాయ మంగళమ్ || 7

అర్ధం: వృషభమాసములో స్వాతి నక్షత్ర దివసమునందు సాయంకాలమున స్తంభము నుండి భక్తుని రక్షించుటకై అవతరించిన నరసింహునకు అనేక శుభములు చేకూరుగాక.

ఆసూర్యచంద్రతారాభం జనచేతోవిహారిణే
అతృప్తామృతరూపాయ నారసింహాయ మంగళమ్ || 8

అర్ధం: సూర్యుడు మొదలుకొని నక్షత్రకాంతులున్నంతవరకు (ఆ ప్రళయాంతము) విచిత్రవేషధారిగా జనుల చిత్తములో ప్రతిఫలించిన ప్రత్యేకావతారమైన నరసింహునకు సకల శుభములు కలుగుగాక! “అతృప్తామృతరూపుడుగాను", “ఆడియాడియ గంకరైన్దు" అని శరకోపసూరిచే సంస్తుతింపబడిన స్వామికి నిత్యమంగళము.

ప్రాయ: ప్రపదనే పుంసాం పౌనఃపున్య నివారిణే
దత్తాభయసుహస్తాయ - నారసింహాయ మంగళమ్ || 9

అర్ధం: “నానుండి ఫలము కోరువాడు ఒకసారి ప్రపత్తి చేసినచాలు" - అని సాక్షాత్తుగా నిరూపించి, అభయహస్తమునొసగిన నరసింహునికి సర్వవిధ మంగళములు కలుగుగాక.

భక్తదత్తగుడా తీర్థ గ్రహణోత్సుకమూర్తయే
సర్వేషాం శాంతిదాయాస్తు నారసింహాయ మంగళమ్ || 10

అర్ధం: ఉగ్రస్వరూప స్వభావములను శాంతింపజేయుటకై భక్తులు ప్రేమతో నొసగిన గుణాతీర్థ (పానక)మును ఆరగించి అందరికి శాంతిని గూర్చు శాంతమూర్తి లక్ష్మీనృసింహునికి మంగళమగుగాక.

దివ్యసూరి ముఖోద్భూత మంగళోద్యత్స్వరూపిణే
మంగళానాం నివాసాయ మర్త్యసింహాయ మంగళమ్ || 11

అర్ధం: శరకోపసూరి - పరకాలసూరి మొదలగు ఆళ్వార్లచే విశేషావతారముగా - విష్ణుమూర్తిగా గుర్తించి సంస్తుతింపబడి స్వగుణములను ఆవిష్కరింపజేసి భక్తులను గాచి, మంగళగుణాకరుడుగా ఉపనిషత్తులలో ప్రస్తుతింపబడిన నరసింహునకు సదా మంగళమగుగాక!

విష్ణుతత్త్య ప్రకాశార్థం - విశేషాకృతిధారిణే
వివిధామవంద్యాయ - నారసింహాయ మంగళమ్ || 12

అర్ధం: వేష్టి సర్వత్రవ్యాప్నోతి - విశతితి విష్ణు:- అంతర్బహిశ్చ తత్సర్యం వ్యాప్య నారాయణ స్థిత:-అనెడు ప్రమాణవాక్యములను సత్యములు చేయుటకై భక్తుడు (ప్రహ్లాదుడు) ప్రతిజ్ఞచేసిన వెంటనే స్తంభమునుండి అవతరించి విష్ణు తత్త్వమును నిరూపించుకున్నవాడా! “వేదైశ్చ సర్వైరహమేవవేద్యః" అని వేదముల చేతనే నమస్కరింపబడినవాడా! విశేషాకృతిధారీ! నరసింహా! నీకు మంగళమగుగాక.

భక్తాభీష్ట ప్రదానాయ ధృతవైభవభాసినే
నృసింహనవరూపాయ చిత్రరూపాయ మంగళమ్ || 13

అర్ధం: భక్తుల యభీష్టముల నెరవేర్చుటకై "నతేరూపం నచాకార: ... భక్తానాం త్వం ప్రకాశమే” అన్నట్లు వారి కొరకే నీ వైభవమును ప్రదర్శించువాడవు, ఉపాసకుల ననుగ్రహించు నెపముతో హనుమత్-గండభేరుండ నరసింహాది నవ (తొమ్మిది) రూపములతో వారిననుగ్రహించినవాడా! ఓ చిత్రరూపధారీ! నృసింహా! భక్తుని అనుగ్రహించి అతని వాక్యము (ఎందెందు వెదకిచూచిన అందందే కలడు దానవాగ్రణివింటెన్)ను ఋజువుచేయుటకై అతిప్రయాసతో సద్యోరూపమును కల్పించుకొని మిక్కిలి శ్రమపడిన స్వామీ! నీకు ఈ సృష్టి ఉన్నంతకాలము మంగళమగుగాక.

మంగళాశాసనపరైః - దివ్యసూరి పురోగమై:
సర్వైశ్చ పూజ్యైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ || 14

అర్ధం: భగవంతునికెల్లప్పుడు "పల్లాండు" యనుచు మంగళాశాసనము చేయు ఆళ్వార్లు మొదలుకొని నాథయామునాది ఆచార్య పరంపరచే మంగళాశాసనము పొందిన నృసింహునికి మంగళమగుగాక.

కౌశికాన్వయ జాతేనరఘునాథకృపాజుషా
స్వామినాథాఖ్యకవినా - లిఖితేయం కృతి:శుభా
ఇన్గుర్తివాసిదేవాయ సప్రశ్రయసమర్పితా
రుచ్యతాం భక్తిపూర్ణానాం - వరదాస్తు చ సర్వదా || 15

అర్ధం: కౌశికాన్వయమునందు జన్మించినవాడు, మహామహోపాధ్యాయ, కవిశాబ్దికకేసరి ఉ.వే. శ్రీమాన్ న.చ. రఘునాథాచార్యస్వామి కృపాపాత్రుడైన గోవర్థనం స్వామినాథాచార్య (ఇనుగుర్తి, జి॥ వరంగల్) కవిచే రచింపబడిన యీ శుభంకర సుప్రభాతము భక్తిపురస్సరముగా ఇన్గుర్తిగ్రామవాసి నృసింహునికి సమర్పించ బడినది - భక్తిపూర్ణ హృదయులు - సాహిత్యరసజ్ఞులైన జనులకు రుచించి, శుభములు నొసగుగాక.