2వ అధ్యాయము
సోమవార మహిమ

ఓ రాజా ! కార్తిక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనో వాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తిక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమారచించువాడు కైలాసనివాసి యగును. కార్తికమాసమున సోమవారమందు స్నానమునుగాని, దాన మునుగాని,జపమునుగాని చేసిన యెడల అశ్వమేధయాగముల ఫలమును బొందును. ఇందుకు సందేహములేదు.
కార్తికమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము రాత్రిభోజ నము, ఛాయానక్త భోజనము,స్నానము, తిలదానము యీ ఆరున్నూ ఉపవాస సమానము లగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రి భోజనమును జేయ వలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్షక్రమును జేయవలెను. అందుకు శక్తిలేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే
భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడరాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 1/2 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6టిలో దేనినయినను ఆచరించని యెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు.
కార్తికసోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించి నట్లయిన శివలోకమును బొందును. స్త్రీలుగాని పురుషులుగాని ఎవరు కార్తికసోమవార మందు నక్షత్రములనుజూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియం దుంచబడిన దూదివలె నశించును. కార్తిక సోమవారమందు శివలింగమునకు అభిషేక మును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును.
ఈ విషయమందొక కథ గలదు. చెప్పెదవినుము, ఇది వినువారికిని చెప్పవారికిని పాపనాశనమగును. కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురి యనునొక ప్రేగలదు. అది చక్కని రూపముతో మంచియౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఓ రాజా! దీని దుర్గణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును దీనిని విడిచిరి.
దీని భర్త సౌరాష్ట్రదేశస్థుడు, అతని పేరు మిత్రశర్మ, అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ద మాడనివాడును, నిరంతరము దయగల వాడును భర్త ఇట్టి ఉత్తమగుణ ములు గలవాడైనప్పటికి అదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దానిచేత దెబ్బలు తినుచును గృహస్థ ధర్మమం దుందు కోరికచేత భార్యను విడువలేక దానితో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, ఔ్యతిషము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును.
ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ యనియు నామముగలదు. భర్తయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత దీనియందు రాగముతో నుండెను. అంత నొకనాడు దీని రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా యిచ్చి నిరంతరము సంభోగమునకు నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తానులేచి పెద్దరాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసికొని తీసికొనిపోయి పాడునూతిలో పడవేసెను. .
ఇటు భర్తను చంపి తరుణులును, పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్రప్రవీణు లును, వర్ణ సంకర కారకులును అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదు లతో నిత్యము సంభోగముచేయు చుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడి యున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రత పరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పర ద్వేషముకలదై దేవతాద్వేషి అయి యుండెను.
అది నిరంతరము దయాశూన్యయై ఆడంబరముచేతగాని, నవ్వుచేత గాని, కపటముచేతగాని విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇట్లుండగానే దీనికి యౌవనము పోయి ముసలి తనము వచ్చినది. తరువాత ప్రణ (రాచకురుపు) వ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు ముదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య యింటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆ ప్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమ దూతలు వచ్చి ఆ కర్కశను పాశములచేతకట్టి యముని కదకు తీసికొనిపోయి యమునికి అప్పగించిరి.
యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెఱజేసి దీనిని భయంకర మగు ముళ్ళతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆ వేడి స్తంభమునుసంభోగించుమనిరి.
తరువాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిర త్రిప్పి రాతిమీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమునుకాచి త్రాగించిరి. సీసమునుకాచి రెండు చెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుపాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్మశ యిట్లు తన పితృ పితామహులతోను, తన బాంధవులతోను తనకు పూర్వము పదితరములు తరువాత పదితర ముల వారితో ఘోరములయిన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను.
భూమియందు పదిహేను మాజులు కుక్కగా జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తికమాసమందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసముచేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులనుజేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవనివేదనచేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళుకడిగికొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్దియైనను దొరక నందున కృశించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను.
ఆ బలిభోజనముచేత కుక్కకు పూర్వజాతి స్మృతికలిగి బ్రాహ్మణో త్తమా! రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ కుక్కా ! మా యింటలో ఏమేమి చేసితివి. రక్షింపుమనుచున్నావు అని అడిగెను.
కుక్క ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని. పాపములను చేయుదానను, వర్ణసంకరమును చేసిన దానను, అన్యపురుషులను మఱగి నిజభర్తను చంపితిని. ఈవి మొదలయిన పాపములు అనేకములుజేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15 మాఱులు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు గలిగినదో చెప్పుము. విని తరించెదను.
ఆ బ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా ! యీ కార్తికసోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక యిప్పుడు నేను వుంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృత గలిగినది.
ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమా ! ఈ కుక్కజాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క యిట్లు ప్రార్థించగా పరోపకారబుద్ధితో కార్తికసోమవారములందు తాను జేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను, మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతో గూడ కైలాసానికి బోయి అచ్చట పార్వతీ దేవి వలె శివునితో గూడ ఆనందించుచుండెను.
కాబట్టి కార్తికమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తిక సోమవారవ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా ! పుణ్యప్రదమైన కార్తిక వ్రతమును నీవు చేయుము.