1వ అధ్యాయము
జనక వశిష్ఠ సంవాదము

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే |

నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహా మునులు ఒకప్పుడు జనకునకు వసిష్ట మహామునిచేత చెప్పబడిన కార్తిక మాహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.
సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తము నీశ్వరులారా ! వినుడు. ఈ కార్తికమాహాత్యమును వసిష్టమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంవత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసారబంధన మును క్రౌంచుకుని మోక్షము పొందుదురు.
ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్దాశ్రమమునకు బోవుచు వసిష్ఠ మహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వసిష్ఠుని జూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము జేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లు కొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వులవంటి కన్నులు గల వాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లనివిన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్య మింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకుదుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది.
సూతుడిట్లు చెప్పెను. తరువాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిఱునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవు చున్నాను. రేపు మా యింటి వద్ద యజ్ఞము జఱుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును. ఆరాజిట్లు పలికెను. మునీ శ్వరా ! యజ్ఞమునకు చాలాద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను బోగొట్టు ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని.
నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మ ములను నాకు చెప్పుము. మునీశ్వరా ధర్మజ్ఞా కార్తిక మాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము. వసిష్టు డిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష గలుగును. లోకోపకారార్తమై నీవడిగిన మాట చాలా బాగు న్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును.
రాజా! సూర్యుడు తులరాశియందుండగా కార్తికమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలయినవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయ్యము లగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తిక వ్రతమును తులసంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తిక శుక్లప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెలరోజులు చేయవలెను.
ఆరంభమందు ఓ దామోదరా ! నేను కార్తిక వ్రతము ఆరంభించుచు న్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము. అని సంకల్పము చేసి కార్తిక స్నానమారం భింపవలెను.
కార్తికమాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచ రించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులా రాశిని ప్రవేశించినతోడనే మూడు లోకములను పవిత్రము జేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీజల ములయందును ప్రవేశించును.
తులారాశియందు కార్తికమున చెరువులందును, దిగుడుభావు లందును నూతు లందును, చిన్నకాలువలందును హరినివసించియుండును. రాజా కార్తికమందు వ్రతము అన్ని వర్గాలవారు జేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తికమాసమందు గంగకుబోయి నమస్క రించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనముచేసి శుద్దుడై మంత్రముల చేత భైరవానుజ్జనుబొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను.
తరువాత దేవర్షి పితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవ్రేలికొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకువచ్చి అచ్చట యక్ష్మతర్పణమునుచేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచ మనముచేసి శిరస్సునువదలి మిగిలిన శరీరమంతయు తడివస్త్రముతో తుడిచికొని నారా యణ ధ్యాన మాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను.
తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞముచేసి తనతోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించినహరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.
కార్తికపురాణము పఠించి (లేక) విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతా ర్చనచేసి వేశ్వ దేవమును నెఱవేర్చి భోజనముచేసి ఆచమనముగావించి తరువాత పురాణ కాలక్షేపమును జేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటిని ఆపివేసి విష్ణ్వా లయమందుగాని, శివాలయ మందుగాని తనశక్తి కొలది దీపములను బెట్టి భక్ష్యభోజ్యాదు లతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమునుగాని, శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తిక వ్రతము భక్తితో చేయు చున్నాడో వాడు పునరావృత్తి వర్ణితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాప ములు కార్తికవ్రతమాచరించిన యెడల నశించును.
బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడు గాని, స్త్రీలుగాని, భక్తిశ్రద్ధలతో కార్తికవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తిక వ్రతమాచరించువానిని జూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందాచరించిన పాతకమునశించును. ఇందుకు సందేహములేదు.