5వ అధ్యాయము
పురాణపఠనమాహాత్యము, శత్రుజిచ్చరిత్రము
వసిషుడు తిరిగి ఇటు చెప్పెను. ఓ జనకమహారాజా ! వినుము. కార్తికమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును జేయవలయును. పుణ్యముచేత పాపము నశించుటయే గాక పుణ్యమధికమగును.
కార్తికమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును జేయు వాడు పాము కుబుసమునువలె పాపములను విడుచును. కార్తికమాస మందు తులసీదళములతోను, తెల్లనివి నల్లనివినైన అవిశపూలతో కరవీర= గన్నేరుపూలతోను హరిని పూజించిన యెడల వైకుంఠమునకుబోయి హరితో గూడా సుఖించును. కార్తికమాసమున భగవద్గీతయందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరిసన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతియగును.
కార్తికమాసమందు హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోకపాదముగాని పురాణము చెప్పినవారును, విన్నవారును కర్మబంధవినిర్ముక్తులగుదురు. కార్తికమాసమందు శుక్లపక్ష మందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాల మందును చండాలుర యొక్కయు, పాపాత్ముల యొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచ వంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తికమాసమందు వనభోజనమాచరించవలయును.
అనేకజాతి వృక్షములతోగూడిన వనమందు ఆమలక (ఉసిరిగ) వృక్షమువద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షతాదులతో బూజించి శక్తి కొలది బ్రాహ్మణులను బూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తికమాస మందు వనభోజనముచేసిన యెడల ఆయాకాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక కార్తికమందు వనభోజనమాచరించవలయును.
కార్తికమాహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచజన్న నుండి ముక్తుడాయెను. రాజిట్లు అడిగెను. ఓ మునీశ్వరా! బ్రాహ్మణుని కుమారుడెవ్వడు? వాడేమి కర్మచేసెను? దేనిచేత విముక్తుడాయెను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహల పడుచున్నాను. వసిష్ఠుడిట్లు పల్కెను. జనకమహారాజా ! చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మ యను బ్రాహ్మణుడు వేదవేదాంగపారంగతుడు గలడు.
ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును జూచి తండ్రి నాయనా ! నీకుపాపములు నశించెడి ఒకమాటను జెప్పెదను. కార్తికమాస మందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము. ఈలాగున తండ్రి చెప్పిన మాటలనువిని కుమారుడు కార్తికమాస ధర్మమనగా యేమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికి చేయతగదు. ఆ మాటవిని తండ్రి ఓరి దుర్మార్గా! ఎంతమాట అంటివిరా, నీవు అరణ్యమందు చెట్టుతొజ్జలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను.
తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి శాపవిముక్తిని దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును. అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లు అనెను. కుమారకా ! ఎప్పుడు నీవు కార్తిక మాహాత్మ్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి గలుగునని చెప్పెను. తండ్రి యిట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు తొట్టిలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైయున్నది. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తికస్నానమాచరించి ఆ వృక్షముయొక్క మొదట కార్తికమహాత్మ్యమును భక్తితో చెప్పుచుండెను.
అంతలో దురాచారుడును, హింసకుడును అగు ఒక కిరాతుడును వేటనిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను జూచి పాపాత్నుడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పనివల్ల ఏమిఫలము అని యడిగెను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పెను. కిరాతా ! వినుము చెప్పెదను నీ బుద్ది మంచి దైనది. ఇది కార్తిక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును.
కార్తికమాసమందు మోహము చేతనైనను స్నానదానాదికమును జేసిన వాడు పాపవిముక్తుడై వైకుంఠమును జేరును. కార్తికమాసమందు భక్తి శ్రద్ధ లతో కూడినవాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పినకార్తిక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుకవిని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను.
విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్ఫి అనుజ్ఞ తీసికొని తన ఇంటికి బోయెను. కిరాతుడును, మూషకదేహ త్యాగమునుబట్టి కార్తిక వ్రతఫలమును జూచి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠముజేరెను. సుగతిని గోరువారు కార్తిక మాహాత్మ్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. కాని విద్వాంసుడు తెలిసి కార్తిక ధర్మమును విని అభ్యసించవలెను.
కాబట్టి తప్పక కార్తికవ్రతము ఆచరించదగినది. ఇది నిజము. ఇది నిజము నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా ! నీవును పురాణములందు బుద్ది నుంచుము. అట్లయిన యెడల పుణ్యగతికి బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు. నిశ్చయము.