26వ అధ్యాయము
హరికృత దుర్వాస ప్రబోధనము
ఇట్లు దూర్వాసనుడు భూలోకము మొదలయిన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు జేరెను. దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించెను. జగన్నాధా ! బ్రాహ్మణ ప్రియా! మధుసూదనా సుదర్శన చక్రసంబంధమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము రక్షించుము. ఓవిష్ణో! సూర్యకోటి సమానకాంతి గల యీ ఘోరచక్రము నన్నుచంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామీ, నివారిం చుము. నీ భక్తుడయిన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు యీ శిక్ష తగియేయున్నది.
వేలకొలది బ్రాహ్మణులలోనేను బహుపాతకుడను, కాబట్టి నన్ను రక్షించుము. హరీ ! నీవక్షస్థలమందు బ్రాహ్మణునిపదము ఉండలేదా? భృగుమహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెనుగదా ! కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను. ఈ ప్రకారము విష్ణుమూర్తిముందు దూర్వాసమహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామీ! నన్ను రక్షించుమని అనేకమారులు దుర్వాససుడు పలికినవాడా యెను. అంత పారినవ్వుచు ఇట్లనియెను. దూర్వాసా ! బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే. మీవంటి వారుమిక్కిలి దేవతలేయగుదురు. “
బ్రాహ్మణోత్తమా ! నీవు సాక్షాత్తు శంకరుడవు. బ్రహ్మ స్వరూపుడవు జటలతో గూడి భృకుటిలమైన నీ ముఖమును జూచినచో యెవ్వరికి భయము గలుగదు? మీ వంటివారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరుగదా ! నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియే యున్నది గదా !
దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతియుగ మందు నేనవతరించుచుందును. దుర్వాసా! నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణములేని శాపమునిచ్చి తివి. అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువునకును అపకారమునుజేయడు. సర్వభూతములందును నన్నుభావించుచు చరాచరములందంట తను నన్ను జూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా ?
నీవు భోజనమునకు వచ్చెదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్టానమున్నదో చేసికొనవచ్చును. కాని అట్టిప్లితిలో నీవు అతనికి అనుజ్జయునివ్వలేదు. కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశిపారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదకపాన మందేమిదోషమున్నది? ఉపవాసకాలమున నీరు త్రాగుట దోషముకానేరదు.
బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనపుడు ఉదకపానము విహితమై యుండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున యేమిదోషము జరిగినది. నీకేది సందు దొరకక దానినొకతప్పుగా జేసికొని శాపమిచ్చితివిగాని విచారించిన అది దోషము అగునా.
అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్నిదూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయంభువునైన నన్ను శరణువేదెను.
అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పదిజన్మల శాపములను అంగీకరించితిని రాజు నీవు శాపమిచ్చుటకయే యెరుగడు వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశి న విడిచిన హరిభక్తిలోపించునను భయముతో జలపారణ చేసితిని. దానితో బ్రాహ్మణ తిరస్కారమాయెనుగదా? హరీ ! నన్నెట్లు కాపాడుదువని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరుగకయుండెను. అట్లుండగా నీవు శాపమిచ్చి తివి. శాపమందు నీవు “మీనము, కూర్మము మొదలైన పదిజన్మలుగమ్ము” అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయ మందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగెను గదా. దీనినెట్లు చేయుదునని ఆలోచింతితిని.
బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము గలుగును. శాపమును నివారించితినేని బ్రాహ్మణవచనమసత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు భక్తరక్షణ మౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని. భక్తులకు గలిగిన అంతులేని మహాకష్టములనన్నిటిని నేను హరింతును.
నాభక్తుడు ధర్మాత్ముడు సమస్తభూతములందు సమబుద్ధిగలవాడు. అట్టి విషయ మును యెఱింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి వయస్సును ముఖ్యముగా జేసికొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసికొని మనుష్యులకు వివిధధర్మములు చెప్పబడి నవిగదా!
పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు. మనుష్య జాతకంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్యజాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మము లను మనుష్యులందరు విడువగూడదు. రెండుపక్షములందును మనుష్యులందరికి ఏకాదశి నాడు భోజన మాచరించగూడదని వేదములందు పరమధర్మము విధించబడినది. అట్లుగాక భుజించినయెడల దోషము చెప్పబడియున్నది.
ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచినదోషము సంభవించును. కాబట్టి నాభక్తి లోపించునను భయముతో వాడు జలపారణ చేసెను. ఇట్లుండగా నీవు వృథాగా విచారిం చక శపమిచ్చితివి గదా. అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచు నంతలో దుర్వాససుని మాటను అసత్యము బొందించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధాయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని.
బ్రాహ్మణోత్తమా ! దుఃఖించకుము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈరూపములను ధరించి అవతారములను ఎత్తవలసియున్నది.
నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితికారణము కొరకు శంఖా సురుని సంహరించుటకును, మనువును రక్షించుకును పెద్ద చేపగుదురు. దేవ దానవులు సముద్రమును మధించుతటిని సముద్రమందు మునిగిన మందరపర్వతమును నావీపున ధరించుటకు తాబేలునగుదును.
హిరణ్యాక్షుని సంహరించుటకును, భూమిని ఉద్దరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందినగుదును. హిరణ్యకశిపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలలచేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును.
లోకత్రయమును జయించి బిని బంధించి యింద్రునకు పోయిన రాజ్యమును యిచ్చుటకొరకు వామనుడు = పొట్టివాడనగుదును.
క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో గూడ క్రూరకర్మయుతు డనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును. రావణుని సంహారము కొరకు ఆత్మ జ్ఞానశూన్యుడైన రాముడను రాజు నగుదును. యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపీకాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును. కలియుగమంద పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాపందమార్గోపదేశినగుదును. కలియుగాంతమందు విప్రశత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడ నగుదును. ఇట్లు నాకు పదిజన్మలు గలుగును. ఈ పది అవతారములు వినువారికి పాతకనాశనములగును.