23వ అధ్యాయము
కావేరీయందు పురంజయుడు కార్తికవ్రతముచేయుట
అగస్త్యముని పల్కెను అత్రిమునీంద్రా ! పురంజయుడు యుద్ధమందు జయమొందిన తరువాత యేమిచేసెనో నాకు దెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రుబాధా రహితమైన అయోధ్యాపట్టణమందు పురంజయ మహా రాజు సమస్త ధనుర్దారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమితకాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును,
ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకువలె స్త్రీ ప్రియుడు, సూర్యుడువలె చూడశక్యము గానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించినవాడును, కార్తికవ్రతముచేత పాపములన్నియు నశింపజేసి కొనినవాడై యుండెను.
ఇట్లున్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్దిజనించి హరిని ఎట్లారాధింతును? ఏదేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించు చున్న రాజుకు ఆకాశవాణి యిట్లనియె.
ఓ పురంజయా శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్ర మున్నది. అచ్చట శ్రీరంగనాధుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్చేదమును జేయువాడగు శ్రీరంగనిలయుని సేవించుమని చెప్పి ఊటకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యాపట్టణమును విడిచి తన చతురంగబలములతోను అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను.
కార్తికమాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము, నివాసముగా గలవాడైన శేషశాయియయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాధస్వామిని పూజించుచు కార్తికవ్రతమును శాస్రకముగా జేసెను. కృష్ణా, కృష్ణాయని గానము చేయుచు గోవిందా, వాసుదేవా
యని నిరంతరము కీర్తించుచు, విష్ణుపూజాపరాయణుడై స్నాన దాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాధుని విధియుక్తముగా ఆరాధించి మాస మంతయు ఇట్లు వ్రతముసల్పి మాసాంతమందు ఉద్యాపనచేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తనదేశమునకు పోయి అందున్న అయోధ్యాపట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగానున్న ప్రాకార ములు తోరణములు గలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగి నదియు అగడ్తలు గలిగినదియు, గుఱ్ఱములతోను, ఏనుగులతోను, రథములతోను నిండియున్నదియు, గృహగోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములుగల పతాకములు గలదియు, వాయువుచేత చలింపజేయబడుచున్న పతాకములుగలదియు, అనేకభటులు కలదియు అనేక దేశవాసులతో గూడినదైయుండెను.
అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు,
క్షత్రియులు, శత్రుసైన్యభేద కులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వసంపదలననుభవించు వారు. అచ్చట స్త్రీలు సుందరు లును, హంసలవలె, యేనుగులవలె నడుచు వారును, చెవుల వరకునుండు విశాలనేత్ర ములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుముగలవారును, బలిసి లావుగానున్న కుచములు గలవారును, మంచివస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి.
అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను, లావణ్యముతోను గూడియున్నవారును, నిత్యమానంద యుక్తులు, మదోన్నతులును, సమస్త స్త్రీగుణభూషితలై చూచుటలోను, మాట్లాడుటలో బహునేర్పరులై సభలలోను రాజమార్గము లలోను రచ్చలలోను ఆటలాడుచుండువారై యుండిరి.
అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణభూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్యమునీంద్రా అచ్చటి మనుజులందరు తమ తమ వర్ణాశ్రమ ధర్మము లందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణ మును జూచి సంతోషించెను. “యథారాజా తథా ప్రజా” అను న్యాయమునుబట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా.
పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలుగూడి ఎదుర్కొనిరి. రాజుమీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును బ్రవేశించి తనయింటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగముల ననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తివ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోకవాసియై సుఖముగా 2నుండెను.
అగస్త్యమునీంద్రా ! కార్తికవ్రతము మహామహిమగలది. ఈ కార్తిక ధర్మము హరికి ప్రియకరము. కార్తికవ్రతమును జేయువాడు పరమపదమును బొందును. అవశమైచేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను యిచ్చునదియు, కలికల్మష నాశకారియునైన కార్తిక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసికొని పునారావృత్తి రహితమైన మోక్షమును బొందును.