14వ అధ్యాయము
మాసచతుర్దశీమాహాత్మ్యము, మాసశివరాత్రి వ్రత ఫలము
కార్తిక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును (ఆబోతు, అచ్చు పోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములుకూడా నశించును. కార్తిక వ్రతము మనుష్యలోక మందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తిక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటి మాజులు గయాశ్రాద్ధమును జేసిన ఫలము గలుగును.
రాజా ! స్వరమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తిక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడనులేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదు మని కోరుచుందురు.
ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్ల మును జేయనివాడు యమలోకమందు అంథతమిశ్రమను నరకమును బొందును. కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను,ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్ధములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్స ర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తికపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును.
అనేక మాటలతో పనియేమున్నది? కార్తికమాసమందు అన్ని పుణ్య ముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్యఋణ పితృఋణముల నుండి విముక్తుడగును.
కార్తిక పూర్ణిమనాడు దక్షిణతో గూడ ధాత్రీఫలమును (ఉసిరిగపండును) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తికపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమ పదము నొందును. కార్తికమాసమందు దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును.
కార్తికపూర్ణిమనాడు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈ జన్న మందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తికమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము)(బాణము). కార్తికవ్రతము అనంత ఫలప్రదము. సామాన్య ముగా దొరకనిది. కనుక కార్తికమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృవేష మును, తినగూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానమును గ్రహించుట ఈ అయిదును విడువవలెను. కార్తికమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకుల యన్నమును, అపరిశుద్దాన్నమును, కర్మలను విడిచి పెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు.
కార్తికమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృ దినమందును, ఆదివారమందును, సూర్యచంద్రగ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తిక మాసము ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధదినము లందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును జేయవలెనుగాని రాత్రి భోజనము చేయగూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును. కనుక రాత్రి భోజనముకూడని దినములందు కార్తిక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించ వలెను. ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట, ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతివిధవలకు ఛాయానక్తము విహితము.
సమస్త పుణ్యములనుయిచ్చు కార్తికమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆ పాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తిక వ్రతమును ఆచరించవలెను. కార్తిక మాసమందు 1.తలంబుకొనుట, 2.పగలు నిద్రయు 3. కంచుపాత్రలో భోజనము 4. మఠాన్నభోజనము 5. గృహమందుస్నానము 6. నిషిద్ధదినములందు రాత్రి భోజనము 7. వేదశాస్త్రనింద యీ ఏడును జరుపగూడదు. తైలాభ్యంగము తలంటుకొనుట.
కార్తికమాసమందు శరీరసామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నాన మాచరించిన యెడల ఆ స్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తికమాసమందు నదీస్నానము ముఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెలరోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలందుగాని,బావులవద్దగాని స్నానము చేయ వలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్ధన చేయవలెను. ఇది గంగయందును, గోదావరి యందును, మహానందులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరింపవలెను.
కార్తికమాసము ప్రాతస్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చందాలుడైపుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరినిధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను.
పగలు చేయదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానముచేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయ వలెను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత 2. వృషధ్వజాయ ధ్యానం సమర్ప యామి. 3. గౌరీ ప్రియాయపాద్యం సమర్పయామి 4.లోకేశ్వరాయ అర్వం సమర్పయామి. 5. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. 6. గంగాధరాయ స్నానం సమర్పయామి 7. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాధాయ ఉపవీతం సమర్ప యామి. 9. కపాలధరిణే గంధం సమర్పయామి. 10. ఈశ్వరాయ అక్షతాన్ సమర్ప యామి. 11. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. 12.తేజోరూపాయ దీపం సమర్ప యామి. 13. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. 14.లోకసాక్షిణే తాంబూలం సమర్ప యామి. 15. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. 16. కపాలినే నమస్కారం సమర్ప యామి. ఈ ప్రకారముగా షోడశోపచారములచేత శంకరుని పూజింపవలెను.
పైన జెప్పిన నామములతో భక్తితో పూజించి మానమంతయు సహస్ర నామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు (మంత్రము) శ్లో|| పార్వతీకాంత దేవేశ పద్మజార్మ్యాంఘిపంకజం అర్వం గృహాణదైత్యా లేదత్తం చేదముమాపతే” అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయములేదు.
రాజా! తనతొక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణు లకు దానమివ్వవలెను. ఈ ప్రకారము కార్తికమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రత మును జేయువాడు వేయి సోమయాగములు, నూరువాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలములు బొందును.
కార్తికమాసమునందీ ప్రకారముగా మాసనక వ్రతమాచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తికమందు మాస నక్త వ్రతమువలన పుణ్యమధికమగును. సమస్త పాపములునశించును. ఇందుకు సందేహము లేదు. కార్తికమాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు.
కార్తికమాసమున శుక్ల చతుర్దశియందు ఔరస పుత్రుడు తిలతర్పణ మాచరించిన యెడల పితృలోకస్థులయిన పితరులు తృప్తినొందుదురు. కార్తిక మాసమందు చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్చేదము గలుగదు. సందేహములేదు.
కార్తికమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించువాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టు నదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తిక వ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును.
పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసికొన్నవారగుదురు.