29వ అధ్యాయము
అంబరీషదుర్వాస సంభాషణము
రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్జానమొందెను. సుదర్శన చక్రము అంతర్థానము బొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాససునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును మునిపాదముల పైన బడవేసియిట్లని విన్న వించెను.
బ్రాహ్మణోత్తమా ! నేను మహాపాపిని. పాపమునందు మునిగి ఉండి కష్టించు చున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా యింటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము. నీవు నాయందుదయయుంచి తిరిగి నాయింటికి వచ్చి నన్ను రక్షించితివి. మూడు లోకము లకు భయమును గలిగించు నీకు భయమెక్కడిది ? భయమనుమిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా యింటికి వచ్చితివి.
నీవు తిరిగి వచ్చుటచేత నేను బ్రతికితిని. నాకు పరలోకముసిద్ధించును. కాబట్టి త్వదర్శనదానముతో నాకభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోక దానము సంభవించినవి.
ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లనియె. రాజా! ప్రాణములను రక్షించువాడు తండ్రియని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి గనుక నాకు తండ్రిని నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసిన యెడల నీవు దుఃఖించెదవు. తండ్రికి కష్టముగలిగిడి వ్యాపారము చేయగూడదు. గాన నీకు నమస్కారమును జేయను. బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును గలిగించితిని. దానికి ఫలమును అనుభవించితిని. చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించతివి. రాజా ! నీతో కూడా భుజించెద నని దుర్వాసనుడు ధర్మబుద్ధిగలవాడై ధర్మవేత్త యయిన అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్ శివరూపుడైన దుర్వాససుడు విష్ణుభక్తుని యొక్క మాహాత్మ్యమును పరీక్షించ గోరివచ్చి యిట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞా పితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను.
కాబట్టి కార్తికమాసమందు హరిబోధినీ ద్వాదశి సమస్త దానఫలప్రదము, సమస్త తీర్థఫలప్రదము, సమస్త యజ్ఞఫలప్రదమగును. కార్తిక మాసమందు శుక్లైకాదశినాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలసి పారణజేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా నున్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోగానే పారణ చేయ వలయును. అందులో కార్తిక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గనుక దానిని యెంత మాత్రము విడువరాదు. కార్తిక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యముస్వల్పమైనను అనంత ఫలప్రదము.
ఈ పుణ్యకథను వినువారు పాపవిముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములననుభవించి అంతమందుపరమపదము పొందుదురు.